![పాలకుర్తిలో లారీ బీభత్సం](https://static.v6velugu.com/uploads/2025/02/lorry-caused-havoc-at-rajiv-chowrasta-in-palakurthi-this-morning_LIV5KWUF2y.jpg)
- ఆర్టీసీ బస్సును ఢీకొట్టి పాన్‌షాపులోకి దూసుకెళ్లిన లారీ
- పది మందికి గాయాలు
పాలకుర్తి, వెలుగు : జనగామ జిల్లా పాలకుర్తిలోని రాజీవ్ చౌరస్తాలో ఆదివారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చి ఆర్టీసి బస్సును ఢీ కొట్టడంతో పది మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... ఆదివారం ఉదయం తొర్రూరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు జనగామ వైపు వెళ్లేందుకు చౌరస్తా దాటుతోంది. ఇదే టైంలో మిర్యాలగూడ నుంచి సిమెంట్‌లోడుతో వరంగల్ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ స్పీడ్‌ను కంట్రోల్ చేయలేకపోవడంతో లారీ వెళ్లి బస్సు వెనుక భాగాన్ని ఢీకొట్టింది.
అనంతరం అదే స్పీడ్‌తో హనుమకొండ రోడ్డు వైపు వెళ్లి పక్కన ఉన్న పాన్‌షాపులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పాలకుర్తి మండలం వావిలాల గ్రామానికి చెందిన అనపర్తి చిలకమ్మ, వెంకటయ్య దంపతులు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెంకు చెందిన కొత్త పద్మారెడ్డి తీవ్రంగా గాయపడగా, మరో ఏడుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానికులు జనగామ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదంలో పలు బైక్‌లు ధ్వంసం అయ్యాయి. లారీ బ్రేక్‌లు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ సైదులు తెలిపారు.